సంబంధిత అధికారులందరిపై దర్యాప్తు చేయాలని డిమాండ్
7 టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 9 : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో డంపింగ్ యార్డు నుంచి చెత్త తరలింపు కాంట్రాక్టులకు సంబంధించిన సుమారు రూ.3.40 కోట్ల చెల్లింపుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లేదా విజిలెన్స్‌తో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డు నుంచి జవహర్‌నగర్‌కు చెత్త తరలింపు పనులకు సంబంధించిన కాంట్రాక్టు చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆకుల సతీష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రూ.3.40 కోట్ల మేర చెల్లింపులు జరిగిన తీరుపై పలు పత్రాలను జతచేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం 2023-25 మధ్య కాలంలో డంపింగ్ యార్డు రవాణా కాంట్రాక్టుకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో అసలు కాంట్రాక్టర్‌కు బదులుగా నకిలీ సంస్థ పేరుతో నిధులు మళ్లించారనే అనుమానాలు వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలు, జీఎస్టీ నమోదు, బ్యాంకు ఖాతాల ఆధారంగా బిల్లులు ప్రాసెస్ చేసి ప్రభుత్వ నిధులు విడుదల చేశారనే ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఎన్డీపీ శేరిలింగంపల్లి డివిజన్ డిప్యూటీ ఇంజినీర్ ధీరజ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడాన్ని స్వాగతించిన ఆకుల సతీష్, ఒక్క అధికారిపై చర్యలతో సరిపెట్టకుండా ఈ వ్యవహారంలో అప్పటి కమిషనర్ రామకృష్ణ, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ సాబీర్ అలీ, సంబంధిత ఇంజినీరింగ్, అకౌంట్స్ విభాగ అధికారులు, బిల్లుల ఆమోద ప్రక్రియలో భాగమైన ఇతర అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాను సమర్పించిన ఫిర్యాదుతో పాటు వర్క్ ఆర్డర్, చెక్ కాపీలు, చెల్లింపులకు సంబంధించిన రిజిస్టర్ నమోదులు, ఇతర పత్రాలను కూడా విచారణలో పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారం కావడంతో కేవలం శాఖాపరమైన విచారణకే పరిమితం కాకుండా ఏసీబీ లేదా విజిలెన్స్ ద్వారా స్వతంత్ర దర్యాప్తు నిర్వహించి, నిజానిజాలు వెలికి తీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారీ మొత్తంలో ప్రజాధనం వినియోగమైన నేపథ్యంలో పారదర్శక దర్యాప్తు జరగడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ విజ్ఞప్తి చేశారు.


