7tv focus : దేశ రాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 10వ తేదీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చి పోయే రైళ్ల సర్వీసులు అన్నింటిని రద్దు చేసింది. ఈ మేరకు భారతీయ రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం ఉదయం 4.00 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల మధ్య ఆయా స్టేషన్లకు రైల్వే సర్వీసులు నడవవని స్పష్టం చేసింది. ఈ స్టేషన్ల నుంచి మొత్తం10 గంటల పాటు రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపింది.ఆ క్రమంలో ఈ రెండు స్టేషన్లకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అక్టోబర్ 9వ తేదీన బయలుదేరే సర్వీసులను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే చెప్పింది. తూర్పు రైల్వే పరిధిలోని పశ్చిమ బెంగాల్ నుంచి న్యూఢిల్లీ చేరుకోవాల్సిన రెండు రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు.. 12301 హౌరా- న్యూఢిల్లీ, 12313 సీల్దా – న్యూఢిల్లీ సర్వీసులు రద్దయ్యాయని వివరించింది. శనివారం న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల వద్ద భారీగా ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారతీయ రైల్వే వివరణ ఇచ్చింది.

