పవన్ కల్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 4:
తెలంగాణ రాష్ట్రం ఎవరో బిక్షంగా ఇచ్చిన రాష్ట్రం కాదని, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, 1200 మందికి పైగా అమరుల బలిదానాలతో సాధించుకున్న స్వాభిమాన రాష్ట్రం అని తెలంగాణ రక్షణ సేన స్టేట్ సెక్రటరీ వేముల భవాని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలు సహించరని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాలు దీర్ఘకాలం పోరాటం చేశాయని గుర్తు చేశారు. ఆ పోరాట ఫలితంగానే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అలాంటి చారిత్రక ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలు అన్నం లేకున్నా బాధను భరించగలరేమో గానీ, తమ ఆత్మగౌరవాన్ని కించపరిచే మాటలను మాత్రం ఎన్నటికీ సహించరని అన్నారు. తెలంగాణ అనేది పోరాటాల గడ్డ అని, ఇక్కడి ప్రజలు తమ గౌరవం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారని పేర్కొన్నారు.

