7tv focus : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? దళపతి విజయ్ బాటలోనే పయనిస్తూ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా? ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ నటించిన ‘ఓం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ధనుష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సాయి పల్లవి వేదికపై ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి వస్తున్న సమయంలో రహదారుల వెంట కనిపించిన జెండాలను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. అక్కడి వాతావరణం చూస్తుంటే సినిమా వేడుకకు వచ్చినట్లు కాకుండా, ఓ భారీ రాజకీయ సభకు వచ్చినట్లు అనిపించిందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో ఆడిటోరియం మొత్తం అభిమానుల కేరింతలు, ఈలలతో మార్మోగిపోయింది.ఆ తర్వాత ధనుష్‌ను ఉద్దేశించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘‘సర్.. మీరు జీవితంలో ఏం చేసినా, ఏ రంగంలోకి వెళ్లినా మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. కానీ నాలోని నటిగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే విజయ్ సర్ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమయ్యారు. అది సినీ పరిశ్రమకు తీరని లోటు. కనీసం మీరు మాత్రం సినిమాల్లో కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. మంచి కథలకు ప్రాణం పోసే ధనుష్ లాంటి ప్రతిభావంతమైన నటులు సినీ పరిశ్రమకు ఎంతో అవసరమని సాయి పల్లవి అభిప్రాయపడ్డారు. ఆయన కూడా సినిమాలకు దూరమైతే ప్రేక్షకులు ఓ అద్భుతమైన నటుడిని కోల్పోవాల్సి వస్తుందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ విజ్ఞప్తికి అక్కడున్న అభిమానులు పెద్ద ఎత్తున చప్పట్లతో మద్దతు తెలిపారు.

