7tv focus : నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి సతీష్ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భావితరాలకు నీటి వనరులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలని, ఆయిల్‌పామ్ సాగు, సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి వివరించాలని కోరారు. గ్రామాల్లో విద్యుత్ వృథాను అరికట్టేందుకు విద్యుత్ స్తంభాలకు ఆన్–ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేసుకోవాలని, పశువుల తొట్టెలు నిర్మించి పశువులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సమావేశంలో చదివి వినిపించారు.

