7tv focus : సుమారు వందకుపైగా కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్లు, ఇతర సాక్ష్యాధారాలు కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయమయ్యాయి. కోర్టు కస్టడీలో ఉన్న విలువైన వస్తువులు కనిపించకపోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని ఎర్నాకులం జిల్లా కోర్టులో ఈ సంఘటన జరిగింది. ఒక కేసుపై విచారణ ముగిసిన తర్వాత కోర్టు కస్టడీలో ఉన్న రూ. 1.90 లక్షల విలువైన లగ్జరీ రాడో వాచ్ను తిరిగి తీసుకునేందుకు ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టు అధికారులు ఆ వాచ్ కోసం స్ట్రాంగ్ రూమ్లో వెతికారు. అయితే అది కనిపించలేదు.కాగా, కోర్టు అధికారుల ఆడిట్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మరో 123 కేసులకు సంబంధించిన ఖరీదైన వస్తువులు, ఇతర సాక్ష్యాధారాలు కూడా మాయమయ్యాయి. కనిపించని కస్టడీలోని వస్తువుల్లో ఎక్కువగా వివిధ బ్రాండ్లకు చెందిన లగ్జరీ, ఖరీదైన వాచీలు ఉన్నాయి. ఈ విషయం బయటపడటంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉంచిన సాక్ష్యాల భద్రత, జవాబుదారీతనంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

