పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని ఆగస్టులో పూర్తి చేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు, జూలై 7 (7టీవీ ఫోకస్): ఏలూరు జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల పార్కుల ఏర్పాటులో గణనీయమైన పురోగతి సాధించగా, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, 22-ఏ భూ సమస్యల పరిష్కారం, రీ-సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జి. జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆగస్టు నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, రైతుల కేవైసీ, భూముల వివరాలు, సర్వే నంబర్లు తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా పాస్ పుస్తకాల ముద్రణ చేపట్టాలని సూచించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, చింతలపూడి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు తుది దశకు చేరుకుందని తెలిపారు. ఏలూరు, పోలవరం, కైకలూరు నియోజకవర్గాల్లో పనులు పురోగతిలో ఉండగా, దెందులూరు, నూజివీడు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అలాగే జిల్లాలో ఆగస్టు నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.

