7tv focus : మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు సీహెచ్.గీతారాణి వెంకటరమణ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో రుద్రంపూర్ మహిళలకు ఉచిత టైలరింగ్, రామవరం మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, గౌతంపూర్ మహిళలకు బ్యూటీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను సోమవారం రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గీతారాణి వెంకటరమణ మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలతో పాటు ప్రాజెక్టు ప్రభావిత, పరిసర ప్రాంతాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే సేవా సమితి ప్రధాన లక్ష్యమన్నారు.శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరై, నైపుణ్యాలను శ్రద్ధగా నేర్చుకొని కోర్సులను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. నేర్చుకున్న విద్యను స్వయం ఉపాధికి ఉపయోగించుకొని కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. అనంతరం 2025–26 ఆర్థిక సంవత్సరంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా లబ్ధిదారులకు సేవా అధ్యక్షురాలి చేతుల మీదుగా శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అలాగే కొత్తగా శిక్షణ పొందుతున్న మహిళలకు పార్వతి మదన్మోహన్ ఒక మగ్గం స్టాండ్‌ను ఉచితంగా అందించారు.

