7tv focus : తిరుమల శ్రీవారి పాదాల చెంత కొలువైన తిరుపతి నగరం మరో ఘనతను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆధ్యాత్మిక నగరంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతిని క్రీడా కేంద్రంగా కూడా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని శెట్టిపల్లెలో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ మైదానం అందుబాటులోకి వస్తే తిరుపతి క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
50 వేల సీటింగ్ సామర్థ్యంతో..
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ స్టేడియంలో ఏకంగా 50 వేల మంది ప్రేక్షకులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం కల్పించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో మైదానాన్ని తీర్చిదిద్దడంతోపాటు క్రికెటర్లు, మ్యాచ్ అధికారులు, మీడియా, ప్రేక్షకులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో విలేకరులతో మాట్లాడిన ఆయన స్టేడియం నిర్మాణానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మూడేళ్లలో మ్యాచ్‌లకు సిద్ధం
ప్రతిపాదిత స్టేడియానికి త్వరలోనే శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి మూడేళ్లలో ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే స్థాయికి మైదానాన్ని సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైదానం నిర్మాణం పూర్తయితే దేశంలోని ప్రముఖ క్రికెట్ వేదికల జాబితాలో తిరుపతి కూడా చేరే అవకాశం ఉంటుంది. భారీ మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను ముందుగానే పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
బీసీసీఐతో ఇప్పటికే చర్చలు
స్టేడియం నిర్మాణానికి సంబంధించి బీసీసీఐతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో మైదానాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమిని శెట్టిపల్లెలో గుర్తించి, భూసేకరణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేడియం చుట్టూ రవాణా, పార్కింగ్, ప్రేక్షకుల రాకపోకలు వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.
క్రికెట్ అభిమానుల కేంద్రంగా తిరుపతి
తిరుపతిలో క్రికెట్‌కు అభిమానుల సంఖ్య భారీగానే ఉంది. నగరంలో తరచూ ఫ్యాన్ పార్కులు నిర్వహించిన సమయంలో క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఐపీఎల్, ప్రపంచకప్, అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలోనూ నగరంలో క్రికెట్ సందడి కనిపిస్తోంది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తి ఉన్న అభిమానులు మాత్రం ప్రస్తుతం ఇతర నగరాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం ఏర్పాటైతే ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది.
ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా..
ఇప్పటివరకు తిరుపతి ప్రాంతానికి చెందిన క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇందుకోసం ప్రయాణ ఖర్చులు, సమయం వెచ్చించాల్సి వస్తోంది. నగరంలోనే అంతర్జాతీయ స్థాయి మైదానం అందుబాటులోకి వస్తే స్థానిక అభిమానులతోపాటు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మ్యాచ్‌ల సమయంలో తిరుపతి నగరంలో క్రీడా సందడి మరింత పెరగనుంది.
ఆధ్యాత్మిక నగరానికి క్రీడా హంగు
తిరుపతికి ఇప్పటికే ఆధ్యాత్మిక నగరంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు నగరానికి వస్తుంటారు. అదే సమయంలో తిరుపతి వైద్య, విద్యా రంగాల్లోనూ ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. పలు కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఇప్పుడు క్రీడా రంగంలోనూ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటైతే తిరుపతి బహుముఖ అభివృద్ధికి మరింత ఊతం చే అవకాశం ఉంది.
వైజాగ్, మంగళగిరి తర్వాత తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్‌లో క్రికెట్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ప్రతిపాదిత స్టేడియం కీలకంగా మారనుంది. ఇప్పటికే విశాఖపట్నంలో అంతర్జాతీయ స్టేడియం ఉండగా, మంగళగిరిలో కొత్త స్టేడియం నిర్మితమవుతోంది. వీటికి తోడు తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద స్థాయి మ్యాచ్‌లు నిర్వహించేందుకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. ఐపీఎల్ వంటి దేశవ్యాప్త ఆదరణ ఉన్న టోర్నీల్లో తిరుపతికి కూడా వేదిక లభించే పరిస్థితి ఏర్పడుతుంది.
పర్యాటకం, వ్యాపార రంగాలకు ఊతం
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల కేవలం క్రీడా రంగానికే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. మ్యాచ్‌ల కోసం వచ్చే వేలాది మంది ప్రేక్షకులు హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, షాపింగ్ వంటి సేవలను వినియోగిస్తారు. తిరుపతికి వచ్చే భక్తులతోపాటు క్రీడా అభిమానుల రాక పెరిగితే నగరంలోని పర్యాటక, ఆతిథ్య రంగాలకు మరింత ఊతం లభించనుంది. పెద్ద మ్యాచ్‌ల సమయంలో స్థానిక వ్యాపారాలకు కూడా అదనపు ఆదాయ అవకాశాలు ఏర్పడనున్నాయి.
క్రీడా ప్రతిభకు కొత్త వేదిక
స్టేడియం నిర్మాణం పూర్తయితే కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లకే పరిమితం కాకుండా స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు కూడా వేదికగా ఉపయోగపడే అవకాశం ఉంది. తిరుపతి, రాయలసీమ ప్రాంతాల్లోని యువ క్రికెటర్లకు అత్యున్నత ప్రమాణాల మైదానంలో ఆడే అవకాశం లభించనుంది. తద్వారా స్థానిక ప్రతిభకు మరింత ప్రోత్సాహం లభించడంతోపాటు భవిష్యత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగేందుకు ఈ మైదానం దోహదపడే అవకాశం ఉంది.

