దాతగా ముందుకొచ్చిన గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి.. బోరు తవ్వకంతో సమస్యకు శాశ్వత పరిష్కారం
7టీవీ ఫోకస్, షాబాద్, జూన్ 19: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాబాద్ పోలీస్ స్టేషన్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పోలీస్ స్టేషన్లో కొంతకాలంగా కొనసాగుతున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకుల సహకారంతో బోరు తవ్వించగా సమృద్ధిగా నీరు లభించింది. పోలీస్ స్టేషన్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉండటంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ కాంతారెడ్డి, ఎస్సై సతీష్, ఏఎస్సై రాములాల్ ఈ విషయాన్ని షాబాద్ సర్పంచ్ గుండాల అశోక్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలిగంటి మధుసూదన్ రెడ్డి సూచన మేరకు రుద్రారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి దాతగా ముందుకొచ్చి బోరు తవ్వకానికి అవసరమైన సహాయాన్ని అందించారు. శుక్రవారం చేపట్టిన బోరు తవ్వకాల్లో సమృద్ధిగా నీరు లభించడంతో పోలీస్ స్టేషన్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లైంది. దీంతో పోలీస్ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ గుండాల అశోక్, ఉపసర్పంచ్ రాహుల్ గుప్తా, బీసీ సేన మండల యువజన సంఘం అధ్యక్షుడు బండ అజయ్ కుమార్, సర్పంచులు సబితా గోవర్ధన్ రెడ్డి, సందీప్ గౌడ్, నాయకులు చక్కటి దేవేందర్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

