జంగారెడ్డిగూడెం పోలీసులకు ప్రశంసలు
జంగారెడ్డిగూడెం, జూలై 5 (7 టీవీ ఫోకస్): పోగొట్టుకున్న 28 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అప్పగించిన జంగారెడ్డిగూడెం పోలీసు సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో పోలీసులు చూపిన చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, ఐపీఎస్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఐపీఎస్, జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ ఎం.వి. సుభాష్ ఆదేశాల మేరకు ఎస్ఐ వీరప్రసాద్, కె. సోమరాజు, కానిస్టేబుల్ కొప్పుల సుబ్రహ్మణ్యం, ఇతర సిబ్బంది గత నెల రోజులుగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించే ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు రూ.5.75 లక్షల విలువైన 28 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, బాధితుల ఇళ్లకే వెళ్లి వారికి అందజేశారు. ప్రజలకు పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి అందించడంలో పోలీసులు చూపిన చొరవకు బాధితులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో మరోసారి అత్యధిక సంఖ్యలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసినందుకు ఎస్ఐ వీరప్రసాద్, కె. సోమరాజు, కానిస్టేబుల్ కొప్పుల సుబ్రహ్మణ్యం, ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు అభినందించి, వారి సేవలను కొనియాడారు.

