హౌస్ కమిటీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
7టీవీ ఫోకస్, మంచిర్యాల, జూన్ 19: సింగరేణి సంస్థలో గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేల కోట్ల రూపాయల అక్రమాలపై హౌస్ కమిటీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి సంపదను పాలకులు దోచుకుంటూ సంస్థను అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అవకతవకలను పరిశీలించేందుకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గనుల సందర్శనకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారిక అనుమతులతోనే వచ్చినప్పటికీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాడిచెర్ల బొగ్గు బ్లాక్, ఓబీఆర్ కాంట్రాక్టులు, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులు, కాంట్రాక్టుల మంజూరు, విద్యుత్ ఉత్పత్తి వ్యవహారాల్లో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కాగ్ నివేదికల్లోనూ పలు అక్రమాలు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణిలో కొత్త విధానాల పేరుతో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ఇతర బొగ్గు సంస్థల్లో లేని ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ విధానాన్ని ప్రవేశపెట్టి టెండర్లలో అక్రమాలకు అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిలో బొగ్గు నిల్వలు, ఆర్థిక వ్యవహారాలపై లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేస్తే కార్మికుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడేదని అన్నారు. సోలార్ ప్రాజెక్టుల అమలులోనూ భారీ వ్యయభారం మోపి ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించిన ఆయన, సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, సంస్థలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

