కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన
హైదరాబాద్, జూన్ 24 (7టీవీ ఫోకస్ ప్రతినిధి): తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం లేఖ రాసిన ఆయన, కర్ణాటక నిర్మిస్తున్న కురిడి, చిక్కాలపర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు మరియు ఎత్తిపోతల పథకాల వల్ల రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కృష్ణా, గోదావరి జలాల విషయంలో జరిగిన అన్యాయాలను గుర్తు చేసిన హరీశ్ రావు, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసిందన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ జల హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కురిడి ఎత్తిపోతల పథకం, చిక్కాలపర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్కు వచ్చే నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోతాయని, దీంతో వేలాది ఎకరాల సాగు భూములు ప్రభావితమయ్యే అవకాశం ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. అలాగే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, భీమా ప్రాజెక్టు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ప్రభావం కేవలం ఆర్డీఎస్కే పరిమితం కాదని, తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు, తాగునీటి అవసరాలు కూడా ప్రభావితమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడటం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని స్పష్టం చేశారు.
హరీశ్ రావు ప్రధాన డిమాండ్లు
- తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలి.
- సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖకు అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలి.
- బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలను కర్ణాటక తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
- అవసరమైతే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేపట్టాలి.
- తెలంగాణ జల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ లేదని ప్రభుత్వం స్పష్టం చేయాలి.

