క్రమశిక్షణ, దేశభక్తితోనే నవభారత నిర్మాణం సాధ్యం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
“నమో జెన్ జెడ్ కాన్క్లేవ్”లో యువతకు దిశానిర్దేశం
హైదరాబాద్, జూన్ 23 (7టీవీ ఫోకస్, ప్రతినిధి): దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి విలువలను అలవరుచుకున్న యువతతోనే నవభారత నిర్మాణం సాధ్యమవుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన “నమో జెన్ జి కాన్క్లేవ్” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఇంజనీరింగ్ కోర్సుల వైపు అధిక మొగ్గు కనిపిస్తోందని, అయితే విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కేవలం ఉద్యోగం కోసం కాకుండా వ్యక్తిత్వ వికాసం, జ్ఞానాభివృద్ధి కోసం విద్యను అభ్యసించాలని అన్నారు. బీఏ, బీఎస్సీ, బీఈడ్, ఎమ్మెస్సీ వంటి సంప్రదాయ కోర్సుల ద్వారా కూడా ఉన్నత స్థానాలకు చేరుకున్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారని గుర్తుచేశారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయని పేర్కొన్నారు. విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ, గత పదేళ్లలో దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐటీఐల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు, విద్యా రుణాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. యువత హక్కులు, ఉద్యోగాలు, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. జూన్ నెలలో ఎమర్జెన్సీ వార్షికోత్సవాన్ని ప్రస్తావించిన రాంచందర్ రావు, 1975లో విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం జైళ్లలో నిర్బంధించిందని విమర్శించారు. దేశభక్తి, జాతీయవాదం ప్రాధాన్యతను వివరిస్తూ, జపాన్, ఇజ్రాయెల్ దేశాల అభివృద్ధికి అక్కడి ప్రజల క్రమశిక్షణ, దేశభక్తి ప్రధాన కారణమని అన్నారు. దేశాభివృద్ధికి జాతీయవాదమే నిజమైన మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ యువత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంచిందని, దేశాభివృద్ధి, జాతీయత, దేశభక్తి విలువలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకులు, పదాధికారులు, విద్యార్థులు, వేలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు.


