పార్కు అభివృద్ధి, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి
సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ శ్రీజన ఐఏఎస్
కుత్బుల్లాపూర్, జూన్ 24 (7టీవీ ఫోకస్ ప్రతినిధి): 130వ ఉమ్మడి సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్‌నగర్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీజన ఐఏఎస్ పర్యటించిన సందర్భంగా స్థానిక సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు ఆలూరి వెంకట శేషాచారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీజన ఐఏఎస్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ఐఏఎస్, కొంపల్లి డిప్యూటీ కమిషనర్ లావణ్య తదితర అధికారుల పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ నాయకులు వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్ఆర్ నాయక్‌నగర్‌లోని జీహెచ్ఎంసీ పార్కును అభివృద్ధి చేయడంతో పాటు వాచ్‌మన్ గది మరమ్మతులు, కొత్త నేమ్‌బోర్డు ఏర్పాటు, దెబ్బతిన్న వాకింగ్ ట్రాక్ పునరుద్ధరణ, పార్కులో లైటింగ్ సదుపాయాల కల్పన వంటి అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. అలాగే డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల కొరత కారణంగా శుభ్రత కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదని, ఎంటమాలజీ సిబ్బంది తగ్గిపోవడంతో దోమల నివారణ చర్యలు ప్రభావితమవుతున్నాయని నాయకులు వివరించారు. ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను ముమ్మరం చేయడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించాలని కోరగా, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కమిషనర్ తెలిపారు. సుభాష్‌నగర్ పైప్‌లైన్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ పనులు ఏడాదికిపైగా జాప్యం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. రహదారి మళ్లింపు కారణంగా ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్నాయని, ముఖ్యంగా పాఠశాల బస్సుల రాకపోకల సమయంలో తీవ్ర రద్దీ ఏర్పడుతోందని వివరించారు. ఈ పనులను వేగవంతం చేయాలని కోరగా, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఇక ఎస్ఆర్ నాయక్‌నగర్‌లో గతంలో నిర్మించిన రహదారులు దెబ్బతినడంతో కొత్త రోడ్ల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. దీనిపై కూడా అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరి వెంకట శేషాచారి, పీవీ భాస్కర్ రెడ్డి, వివి రమణ, హరిబాబు యాదవ్, పూర్ణచంద్రగుప్త, వెంకట శ్యామ్, శ్రీనివాసాచారి, సోమేశ్వరరావు, వేణుచారి, అలీబాయ్, గోవిందస్వామి, బాబు గౌడ్, కిషోర్, శ్రీనివాసులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కూడా హాజరయ్యారు.

