7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 27: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణ పర్యటన పార్టీ సంస్థాగత బలోపేతానికి కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న విజయ సంకల్ప సమ్మేళనం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న విజయ సంకల్ప సమ్మేళనం ఏర్పాట్లను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జూన్ 28న హైదరాబాద్‌కు చేరుకున్న నితిన్ నబిన్ శంషాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు మరో తొమ్మిది జిల్లా పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు. ఇది తెలంగాణలో పార్టీ సంస్థాగత విస్తరణలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యకర్తల సమావేశానికి జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ పరిధిలోని బూత్ అధ్యక్షులు, బూత్ ఏజెంట్లు, బీఎల్ఏ-2లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులతో కలిపి సుమారు 15 వేల మంది కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా వరంగల్‌లో బూత్ స్థాయి నాయకులతో సమావేశం, ఘట్కేసర్ సమీపంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం, వీవీబీఐటీ క్యాంపస్‌లో యువత, విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పుకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనని రాంచందర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ అభయ్ పాటిల్, ఎంపీ రేఖా శర్మతో కలిసి సమీక్షించినట్లు తెలిపారు.

