7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 28: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 300 మంది వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించినట్లు ట్రాఫిక్-1 అదనపు డీసీపీ జి. హన్మంతరావు తెలిపారు. ఈ తనిఖీల్లో మొత్తం 300 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 259 మంది ద్విచక్ర వాహనదారులు, ఆరు మంది ఆటో డ్రైవర్లు, 34 మంది కార్ల డ్రైవర్లు, ఒక హెవీ వాహన డ్రైవర్ ఉన్నారు. బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (BAC) ఆధారంగా పరిశీలిస్తే.. 245 మంది 36 నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్, 30 మంది 201 నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్, మరో 25 మంది 301 నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ వరకు ఆల్కహాల్ మోతాదుతో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పట్టుబడిన వారందరినీ చట్ట ప్రకారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమై ప్రాణనష్టం జరిగితే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)-2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేరానికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాగా, గత వారం (జూన్ 22 నుంచి 27 వరకు) నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 251 కేసులను కోర్టులు పరిష్కరించినట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. సంబంధిత నిందితులకు జరిమానాలు విధించినట్లు తెలిపారు.

