7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 29: జీవితంలో విజయానికి షార్ట్కట్లు ఉండవని, కృషి, నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే తమ పార్టీ లక్ష్యమని నితిన్ నబీన్, రామచందర్ రావు అన్నారు. తెలంగాణలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.

చిన్న వయసులోనే జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంపై స్పందిస్తూ, తాను రాజకీయాల్లోకి రావడం అనుకోకుండా జరిగిందన్నారు. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తనకూ అనేక సందేహాలు ఉండేవని చెప్పారు. అయితే జీవితంలో షార్ట్కట్లు ఉండవని, అది వేగానికి సంబంధించిన పరీక్ష కాదని, సహనం, నిలకడకు సంబంధించిన పరీక్ష అని తాను నేర్చుకున్నట్లు తెలిపారు. సభ్యుడి స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయికి చేరుకునే వరకు ప్రతి బాధ్యతను అంకితభావంతో నిర్వహించానని, బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తే పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని పేర్కొన్నారు. యువత తమ ప్రత్యేకతపై విశ్వాసం కలిగి ఉండాలని, సమాజ ఒత్తిడికి కాకుండా తమ లక్ష్యాలను నమ్ముకుని ముందుకు సాగాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై స్పందిస్తూ, గతంతో పోలిస్తే నేటి యువత మరింత చైతన్యవంతంగా, అవగాహనతో ఉందన్నారు. సాంకేతికత, ఇంటర్నెట్ విస్తరణతో ప్రజలకు ఇచ్చిన హామీలను యువత గుర్తుంచుకుంటోందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరచిపోయే రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. బీజేపీ సాధ్యం కాని హామీలు ఇవ్వదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తమ విధానమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యం బాధ్యతాయుత పాలన, హామీల అమలు, దీర్ఘకాలిక అభివృద్ధి దృష్టితో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

