7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 29: వనపర్తి జిల్లాలో జరిగిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ప్రమాదం బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను కోరారు. వనపర్తి సమీపంలోని రంగాపూర్ వద్ద జాతీయ రహదారి–44పై ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం అందిందని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ అధికారులు, పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం అభినందనీయమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు.ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా రహదారి భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, జాతీయ రహదారులపై వాహనాల వేగ నియంత్రణ, డ్రైవర్ల అప్రమత్తత, భద్రతా చర్యలపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రభుత్వాల ప్రథమ బాధ్యత కావాలని ఆయన పేర్కొన్నారు.

