7tv focus : పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా నల్లగొండ నగరంలోని 1 నుండి 25 వార్డుల వరకు ముఖ్య నాయకులు, కార్పోరేటర్లు, కాంటెస్ట్ కార్పోరేటర్లు పట్టభద్రుల ఓటు నమోదు ఎన్రోలర్లతో జరిగిన సమావేశంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల నమోదు కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. ఎన్రోలర్లు, కార్పొరేటర్లు, కాంటెస్టడ్ కార్పోరేటర్లు, ముఖ్య నాయకులు.. నగరంలోని ఎవరికి వారు తమకు సంబంధించిన డివిజన్లలో ఇంటింటికి తిరిగి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేయాలన్నారు. ఒకవేళ ఇప్పటికే ఓటరు నమోదు చేయించుకున్న వారి వివరాలు తీసుకుని నమోదు చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా నల్లగొండలోని వివిధ డివిజన్లలోని, కాలనీలలో ప్రతి ఇంటికి తిరిగి ఉద్యోగస్తులను, గ్రాడ్యుయేట్లను, గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఈ విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దని ప్రతి ఒక్కరు కూడా నమోదు కార్యక్రమంలో భాగస్వాములై పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఓటరు నమోదు కోసం ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్లగొండ జిల్లా తిరుగుతున్నానని ఎక్కడికి పోయినా మంచి రెస్పాన్స్ వస్తున్నదని, ఇది పార్టీ భవిష్యత్ గెలుపునకు బాట వేస్తుందన్నారు. గతంలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయకపోవడటం వల్ల మనం ఓడిపోయామని, కానీ ఈసారి అలా జరగడానికి వీలు లేదని, మూడు జిల్లాలోని మొత్తం 36 నియోజకవర్గాల్లో 34 చోట్ల కాంగ్రెస్ వారి మిత్రపక్షం అధికారంలో ఉందని తెలిపారు. వారి అధికారాన్ని, డబ్బులను అడ్డుకుని తాము ఎన్నికల్లో గెలిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరుగుండదన్నారు. కావునా ప్రతి ఒక్కరు ఓటరు నమోదుకు కృషి చేయాలని కోరారు.

