7tv focus : దీపావళి అంటే చీకటిని పారద్రోలే దీపాల వెలుగులు. ఇంటిల్లిపాదీ కలిసి జరుపుకునే ఆనందాల పండుగ. కానీ సింగరేణి ప్రాంతంలో దీపావళికి మరో ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. ఇక్కడ వెలిగే ప్రతి దీపం వెనుక ఓ జ్ఞాపకం. ప్రతి సమాధి వెనుక ఓ కుటుంబ కథ. ప్రతి కుటుంబం గుండెల్లో చెరిగిపోని ఓ ఆత్మీయత దాగి ఉంది. భౌతికంగా తమ మధ్య లేకపోయినా.. జ్ఞాపకాలలో ఎప్పటికీ జీవించే తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద దీపాలు వెలిగిస్తూ దీపావళి జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్, గౌతంపూర్, ధన్బాద్, రామవరం ప్రాంతాల్లో ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. దీపావళి పండుగకు కొన్ని రోజుల ముందే కుటుంబ సభ్యులు తమ ఆత్మీయుల సమాధుల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించి శుభ్రం చేస్తారు. సమాధులకు రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తారు. పండుగ రోజున కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుంటారు. మరణించిన తమ ఆత్మీయులకు ఇష్టమైన ఆహార పదార్థాలను తయారుచేసి సమర్పిస్తారు. దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుతూ వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటారు. ఒకప్పుడు తమతో కలిసి పండుగ జరుపుకున్న వారు నేడు కనిపించకపోయినా.. వారి జ్ఞాపకాలతోనే పండుగను జరుపుకుంటారు. ఆ సమయంలో స్మశానవాటికలు సైతం దీపాల వెలుగులతో ఓ ప్రత్యేకమైన వాతావరణాన్ని సంతరించుకుంటాయి.

