7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 26: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కల్పించిన భద్రతను తొలగించడాన్ని తప్పుబట్టారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను తొలగించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమర్థవంతమైన ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాష్ట్రపతి పురస్కారంతో పాటు పలు అవార్డులు అందుకున్నారని, గతంలో గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా కూడా విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. భద్రతా ముప్పు ఉందని నిఘా సంస్థలు నివేదిక ఇచ్చిన వ్యక్తికి రక్షణను తొలగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమని, అలాంటి పరిస్థితుల్లో భద్రతను తొలగించడం పలు అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను పెంచాల్సింది పోయి తొలగించడం సమంజసం కాదన్నారు. భద్రతా ముప్పు ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం రక్షణ కల్పించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయ ఉద్దేశాలతో భద్రతను తొలగిస్తే న్యాయస్థానాలు కూడా సమర్థించవని అభిప్రాయపడ్డారు. వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను పునరుద్ధరించి, అవసరమైతే అదనపు భద్రతతో పాటు కొత్త వాహనం కూడా కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఏదైనా హాని జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

