7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 9: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని, బీఎల్వోలకు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని బీఆర్ఎస్ సూరారం డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129వ సూరారం డివిజన్ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా నెహ్రూనగర్, మార్కండేయనగర్ ప్రాంతాల్లో బీఎల్వోలు, బీఎల్ఏలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పు, వివరాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పుప్పాల భాస్కర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం కావాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు చేరేలా చూడడంతో పాటు, బూత్ల పరిధిలోని ఓటర్ల వివరాల సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రశాంత్, జమీల్, అఖిల్, కిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.

