7tv focus : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఆదివారం కలకలం రేపాయి. తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, ఇది తీవ్రమైన వివక్షేనని ఆయన ఆరోపించారు.తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం వల్లే ఇలా జరుగుతోంది. ఇతర సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఇలా చేయగలరా? ఎస్సీ, ఎస్టీ, బీసీ శాసనసభ్యులు మీ దృష్టిలో ఏమైనా తక్కువా? అంటూ ఆయన ప్రశ్నించారు. విస్సన్నపేట మండలంలో సీసీ రహదారుల నిర్మాణ ప్రారంభోత్సవాలు తనకు తెలియకుండానే జరిగాయని ఆయన తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గంలో అలజడి సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని మరో పోస్టులో పేర్కొన్నారు. కొలికపూడి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ తరఫున గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్‌గా పనిచేసిన ఆయన తరచు వివాదాల్లో ఉండే వ్యక్తి . ఇటీవలే ఒక పీఈటీ ఉపాధ్యాయుడిని ఇంటికి పిలిపించి దుర్భాషలాడి కొట్టారనే ఆరోపణలు వచ్చాయి.

