కుత్బుల్లాపూర్, జూలై 9 (7 టీవీ ఫోకస్): గాజులరామారం సర్కిల్ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు సొంటి రెడ్డి పున్నారెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గాజులరామారం సర్కిల్, కుత్బుల్లాపూర్ జోన్లో నిర్వహించిన కాలనీ అసోసియేషన్ల సమావేశంలో సొంటి రెడ్డి పున్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజులరామారం సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు తదితర సమస్యలను కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీల్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి ప్రాధాన్య క్రమంలో పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వివిధ కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొని తమ తమ ప్రాంతాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

