25 క్వింటాళ్ల నల్ల బెల్లం, 200 కిలోల పటిక, 20 లీటర్ల నాటు సారా స్వాధీనం

7టీవీ ఫోకస్, తొర్రూరు, జూన్ 14: గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్ల బెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకుని భారీ మొత్తంలో ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం డివిజన్ కేంద్రంలోని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ కె. నాగయ్య వెల్లడించారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం, పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామ శివారులో విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ట్రాలీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, 50 సంచుల్లో 25 క్వింటాళ్ల (2,500 కిలోలు) నల్ల బెల్లం, నాలుగు సంచుల్లో 200 కిలోల పటిక, 20 లీటర్ల నాటు సారా లభ్యమయ్యాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని రవాణాకు వినియోగించిన ట్రాలీని సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరిపెడ మండలం దాస్య తండాకు చెందిన ట్రాలీ డ్రైవర్ గుగులోతు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ నాగయ్య మాట్లాడుతూ గుడుంబా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం, పటిక తదితర ముడి పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. గుడుంబా కేసుల్లో పట్టుబడిన వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిమానాలు, జైలు శిక్షలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో గుడుంబా నిర్మూలనే లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తున్నామని, ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై ఎన్. రజిత, సిబ్బంది శ్రీనివాస్ కుమార్, శరత్, బాబు తదితరులు పాల్గొన్నారు.

