7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 26: విద్యార్థుల్లో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు, రవాణా, సరఫరా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 26, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు కమిషనరేట్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, క్రీడా అకాడమీలు, కోచింగ్ సెంటర్లు, విద్యార్థులు, ఉద్యోగులకు వసతి కల్పించే ప్రైవేటు హాస్టళ్లు, పీజీ, కో-లివింగ్ సంస్థలు తప్పనిసరిగా యాంటీ డ్రగ్ కమిటీ (ADC)లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యాసంస్థలో కనీసం ఐదుగురు సభ్యులతో యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులతో సమన్వయం కోసం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలి. క్యాంపస్‌లో డ్రగ్స్ దుష్పరిణామాలు, ఎన్డీపీఎస్ చట్టం-1985లోని శిక్షలకు సంబంధించిన హెచ్చరిక బోర్డులు, అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, హాస్టల్ వార్డెన్లు, స్థానిక పోలీసులతో కలిసి డ్రగ్స్ నిరోధక అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే సెమినార్లు, వర్క్‌షాపులు, కౌన్సెలింగ్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలు, హాస్టళ్లలో అప్రమత్తంగా ఉండి డ్రగ్స్ వినియోగం, విక్రయం, రవాణా లేదా అక్రమ కార్యకలాపాలపై అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112, హెల్ప్‌లైన్ నంబర్లు 8712663333, 8712663236, 040-27853412లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై ఎన్డీపీఎస్ చట్టం-1985తో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ (మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ చట్టం-2013 మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ స్పష్టం చేశారు.

