బాచుపల్లిలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 28: మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ఆరోగ్యవంతమైన యువతే దేశాభివృద్ధికి బలమైన పునాది అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) బాచుపల్లి డివిజన్ అధ్యక్షులు వంగపల్లి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం బాచుపల్లి ఎక్స్ రోడ్స్‌లో నిర్వహించిన “సే నో టు డ్రగ్స్ – 5కే రన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోందని, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా ప్రతి కుటుంబం, ప్రతి విద్యాసంస్థ, ప్రతి సామాజిక సంస్థ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించినప్పుడే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. యువత క్రీడలు, విద్య, ఉపాధి, సామాజిక సేవ వంటి సానుకూల రంగాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో యువత, మహిళలు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి అభిప్రాయాలను సేకరించగా.. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా దెబ్బతీసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. యువత చెడు స్నేహాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రత్యేక బృందాల ద్వారా విస్తృతంగా చర్యలు చేపడుతోందని, అక్రమ రవాణా, విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తూనే అవగాహన కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తోందని వక్తలు పేర్కొన్నారు. 2కే, 5కే, 10కే రన్లు, వాక్‌థాన్‌లు, సైకిల్ ర్యాలీలు వంటి కార్యక్రమాలు యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు రంగారావు ప్రసాద్, సుజాత, కొలను వీరేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యువత, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నిర్వాహకులు ప్రతి ఒక్కరూ “డ్రగ్స్‌కు నో… జీవితానికి యెస్” అనే సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి యువకుడికి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

