కుత్బుల్లాపూర్, జూన్ 26, (7టీవీ ఫోకస్ ప్రతినిధి): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్యలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయని సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ ఆరోపించారు. ప్రగతి నగర్ డివిజన్ ఇంద్రన్న కాలనీలో వారం రోజులుగా డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ డివిజన్ ఇంద్రన్న కాలనీలో గత వారం రోజులుగా డ్రైనేజీ మాన్హోల్ పొంగిపొర్లుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలో అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ మాన్హోల్స్ పొంగిపొర్లుతున్నాయని, దీంతో ప్రజలు దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా శానిటేషన్ విభాగం, ఇంజినీరింగ్ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు మున్సిపల్ అధికారులు, వాటర్ బోర్డు అధికారుల మధ్య కూడా సమన్వయ లోపం ఉండటమే సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణమని ఆయన విమర్శించారు. ఇంద్రన్న కాలనీలోని డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పాలభిందెల శ్రీనివాస్ హెచ్చరించారు.

