7టీవీ ఫోకస్, ఆంధ్రప్రదేశ్, జూన్ 27: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వివిధ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పర్యటనను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభ, పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ మొత్తం పర్యటనను జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. పర్యటనకు ముందుగానే హెలిప్యాడ్, వీఐపీ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకల మార్గాలను ఎస్పీ స్వయంగా పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి ప్రాంతంలో పోలీసు సిబ్బందిని వ్యూహాత్మకంగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావేదిక, హెలిప్యాడ్, వీఐపీ మార్గాలు, కీలక కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ముందస్తు తనిఖీలు నిర్వహించి ప్రతి ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు.

వీఐపీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సభా ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ విభాగం ముందస్తు ప్రణాళికతో రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేసి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను దారి మళ్లించడం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రజావేదికలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి జిల్లా నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, పర్యటన విజయవంతం కావడానికి పోలీసు శాఖతో పాటు ట్రాఫిక్ విభాగం, ప్రత్యేక పోలీసు బలగాలు, ఇంటెలిజెన్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని తెలిపారు. విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే భద్రతా సూచనలను పాటిస్తూ పోలీసులకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యటన మొత్తం ప్రశాంతంగా ముగియడం పోలీసు శాఖ సమర్థవంతమైన ప్రణాళిక, సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

