7tv focus : కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా తోపులాట కూడా జరిగింది. అలాగే పూలగుత్తులు, బూట్లు వంటివి విసురుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం లక్నోలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ బాధ్యతలు స్వీకరించారు.కాగా, యూపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అజయ్ రాయ్ తన మద్దతుదారులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జనం గుమిగూడి ఉండటంతో ‘అధ్యక్షులు వస్తున్నారు, దారి ఇవ్వండి’ అని ఆయన మద్దతుదారులు కోరారు. అయితే కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మమతా చౌదరి వర్గం దీనిపై స్పందించింది. ‘ఏ అధ్యక్షుడు?’ అని వారు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తిట్టుకోవడం జరిగాయి. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణగా ఇది మారింది. ఈ నేపథ్యంలో అజయ్ రాయ్ మద్దతుదారులు నినాదాలు చేశారు. చేతుల్లో చెప్పులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ ఘర్షణ సమయంలో తోపులాట, చెప్పులు విసురుకోవడం వంటివి కూడా జరిగినట్లు తెలుస్తున్నది.మరోవైపు ఈ సంఘటన తర్వాత రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ, నూతనంగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్తో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకుల దృష్టికి అజయ్ రాయ్ ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ ఘర్షణలో ప్రమేయం ఉన్న వారు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.

