కుత్బుల్లాపూర్, జూలై 8 (7 టీవీ ఫోకస్): విద్యార్థులు ప్రాథమిక విద్య దశ నుంచే మంచి అలవాట్లు, సత్ప్రవర్తనతో పాటు మొక్కల పెంపకంపై అవగాహన పెంపొందించుకోవాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పచ్చదనం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సూరారం డివిజన్-129 పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న “ఆన్ టైమ్ స్కూల్”లో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు, సత్ప్రవర్తనను అలవర్చుకోవడంతో పాటు మొక్కల పెంపకంపై ప్రత్యేక ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం ద్వారానే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.

మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి ప్రాధాన్యంపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు పాఠశాల యాజమాన్యం నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఉదయ్ కిరణ్, ప్రిన్సిపల్ పద్మకుమారి, మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కోలా శ్రీకాంత్, సిద్ధిక్, హెచ్ఏఎల్ బషీరుద్దీన్, యోగ మల్లేష్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

