7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 27: ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థ పోలీసులతో సమన్వయంగా పనిచేస్తే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని సైబరాబాద్ కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ విక్రేతలకు శనివారం మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. సుమారు 300 మంది సెక్యూరిటీ సిబ్బంది, ఏజెన్సీ ప్రతినిధులు, సీసీటీవీ విక్రేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఎన్. కోటి రెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ (PSAR) చట్టం–2005 ప్రకారం అన్ని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా నమోదు చేసుకుని, చట్టంలోని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సెక్యూరిటీ సిబ్బంది కేవలం భవనాల రక్షణకే పరిమితం కాకుండా, నేరాల నివారణలో పోలీసులకు తొలి సమాచార వనరులుగా పనిచేయాలని పేర్కొన్నారు. గతంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలను ఉదాహరణగా వివరిస్తూ అప్రమత్తతతో వ్యవహరిస్తే అనేక నేరాలను ముందుగానే అరికట్టవచ్చని చెప్పారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల్లో విధులు నిర్వహించే సెక్యూరిటీ గార్డులు ప్రతి సందర్శకుడి వివరాలను విజిటర్ రిజిస్టర్లో నమోదు చేయాలని, గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే ప్రవేశానికి అనుమతించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా భద్రతకు ముప్పుగా కనిపించే ఏ అంశమైనా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల సమస్యలు, వీఐపీ బందోబస్తు సమయంలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. సీసీటీవీ విక్రేతలు, నిర్వహణ బాధ్యులు ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రతి సంస్థ పోలీసులతో వేగంగా సంప్రదింపులు జరిపేందుకు అత్యవసర ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైనప్పుడు పోలీసుల సూచనలను వెంటనే అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ అదనపు డీసీపీ పురుషోత్తం, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగిరెడ్డి, జోన్ పరిధిలోని సీఐలు పాల్గొన్నారు. సదస్సు అనంతరం ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల ప్రతినిధులు, సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ విక్రేతలు పోలీసులతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రజల భద్రత కోసం పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


