7tv focus : ఉదయాన్నే లేచి ఓ చుక్క టీ తాగదాం అనుకునే వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇప్పటి వరకు చక్కెర ధరలు మాత్రమే పైపైకి చూస్తున్నాయనుకున్న తరుణంలో ఇప్పుడు పాల ధరలు కూడా కొండెక్కబోతున్నాయి. వెరసి చిన్న పిల్లాడికి పట్టే పాల దగ్గర నుంచి మనం తాగే టీ, కాఫీ, మజ్జిగ, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి అన్ని డైరీ ఉత్పత్తులపై భారీ ప్రభావం పడబోతుంది!ఆర్థిక రాజధాని ముంబైలో పాలు కొనుగోలు చేసే సామాన్యులకు సెప్టెంబర్ ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బ తగలనుంది. డెయిరీ ఫారమ్‌ల నుంచి పాలు కొనుగోలు చేసే వినియోగదారులు ఇకపై లీటరుకు రూ. 8 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీనితో ప్రస్తుతం ముంబయి మార్కెట్లో లీటరు రూ. 100 వరకు ఉన్న పాల ధర ఏకంగా రూ. 110 మార్కును తాకనుంది. పొద్దున్నే లేవగానే కాఫీ, టీలతో ముఖం కడిగే ముంబైవాలలకు ఈ ధరల మంట తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
హోల్ సేల్ పెంపే అసలు కారణం
ఈ సడన్ బాంబుకు ప్రధాన కారణం ‘ముంబై మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ తీసుకున్న నిర్ణయమే. డెయిరీ యజమానుల సమక్షంలో హోల్ సేల్ పాల ధరను లీటరుకు రూ. 93 నుంచి ఏకంగా రూ. 102 వరకు పెంచుతూ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. హోల్ సేల్ మార్కెట్లోనే లీటరుపై రూ. 9 పెరగడంతో, అది చివరికి రీటైల్ వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టేలా లీటరు రూ. 110కి చేరనుంది. ఈ నిర్ణయం ముంబైలోని లక్షలాది కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేయనుంది.

