రూ.37 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, బస్తీలో మౌలిక వసతుల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్లో అంతర్గత రహదారుల అభివృద్ధిలో భాగంగా రూ.37 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాదేవపురం డివిజన్లోని అన్ని కాలనీలు, బస్తీలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో అవసరమైన నిధులు మంజూరు చేయించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాణ్యమైన రహదారులు నిర్మించడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి, మహాదేవపురం జనరల్ సెక్రటరీ ప్రసాద్ దుగ్యాల, ఉపాధ్యక్షులు రంగారావు, జగదీశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, దిలీప్ కుమార్, మల్లారెడ్డి, రామకృష్ణారెడ్డి, యాదగిరి చారి, నవీన్ కుమార్, వెంకట్ రెడ్డి, రాము, అక్షర జ్యోతి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎన్. పూలమ్మ, కాలనీవాసులు, పలు కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

