ఎన్సెంబుల్ హెల్త్ పార్ట్నర్స్లో మహిళల అవగాహన సదస్సు..
సైబరాబాద్ డీసీపీ కె. సృజన కీలక సూచనలు
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 10:
మహిళల భద్రత, సాధికారత, ఆరోగ్య పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సైబరాబాద్ మహిళ, శిశు, యువజన భద్రత విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కె. సృజన అన్నారు. మహిళలు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఎలాంటి నేరం జరిగినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల భద్రత, అవగాహన, సాధికారతను పెంపొందించే లక్ష్యంతో ఎన్సెంబుల్ హెల్త్ పార్ట్నర్స్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం మహిళల అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు, సైబరాబాద్ పోలీసులు, వైద్య నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సైబరాబాద్ మహిళ, శిశు, యువజన భద్రత విభాగం డీసీపీ కె. సృజన మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలపై సమగ్రంగా వివరించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

మహిళలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి నేరం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) చేపడుతున్న కార్యక్రమాలు, సైబరాబాద్ పోలీసులతో కలిసి మహిళల భద్రత కోసం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను డైరెక్టర్ రష్మి శ్రీవాస్తవ వివరించారు. ఈ సందర్భంగా భారత్ టీమ్ కలరిపయట్టు ఆధారంగా రూపొందించిన ఆత్మరక్షణ విన్యాసాలను ప్రదర్శించి, ప్రమాదకర పరిస్థితుల్లో మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలో ప్రత్యక్షంగా వివరించింది. అనంతరం డాక్టర్ నిదా ఫాతిమా హజారి మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం, నివారణ వైద్యం, జీవనశైలిపై అవగాహన కల్పించారు. చివరగా మహిళల భద్రత, పరస్పర గౌరవం, సమానత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. మహిళా సాధికారతకు తమ సంస్థ కట్టుబడి ఉందని, భవిష్యత్తులోనూ సైబరాబాద్ పోలీసులతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎన్సెంబుల్ హెల్త్ పార్ట్నర్స్ ప్రతినిధులు తెలిపారు.

