ఎండీఎంఏ, ఓజీ కుష్ గంజా స్వాధీనం.. పేడ్లర్ అరెస్ట్..పరారీలో ఇద్దరు

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 14: మాదాపూర్లో డ్రగ్స్ పంపిణీ, వినియోగ ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. మాదాపూర్ పోలీసులు, కూకట్పల్లి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్వోటీ) సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఓ డ్రగ్ పేడ్లర్ను అరెస్టు చేసి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రధాన సరఫరాదారులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 13న మాదాపూర్లోని చంద్రానాయక్ తండా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్పై పోలీసులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో విజయవాడకు చెందిన ధనేకుల తరుణ్ తేజ (22) వద్ద నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 382 గ్రాముల ఓజీ కుష్ గంజా, 9 మొబైల్ ఫోన్లు, 2 డిజిటల్ తూనిక యంత్రాలు, డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన సామగ్రి, ప్యాకింగ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో తరుణ్ తేజ విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్వి అనే వ్యక్తుల నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దాడి సమయంలో అదే ఫ్లాట్లో ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వచ్చిన ఎనిమిది మంది యువకులు మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు గుర్తించారు. వీరంతా తరుణ్ తేజ వద్ద నుంచే ఎండీఎంఏ, ఓజీ కుష్ గంజాను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా గొలుసును పూర్తిస్థాయిలో ఛేదించేందుకు, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మాదాపూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే గోప్యంగా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్, ఎస్వోటీ డీసీపీ శోభన్ కుమార్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించగా, ఎస్వోటీ, మాదాపూర్ పోలీసుల సమన్వయాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

