కుత్బుల్లాపూర్, జూలై 8 (7 టీవీ ఫోకస్): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్లో పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలను పరిశీలించారు. సూరారం డివిజన్-293 పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మౌలిక వసతుల అభివృద్ధితోనే ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. శ్రీరామ్ నగర్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను దశలవారీగా పూర్తి చేసి కాలనీని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వేగంగా పరిష్కరించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈఈ అనురాగ్, వాటర్ వర్క్స్ డీజీఎం రవి నాయక్, మేనేజర్ రోహిణి, మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి, కోల రవీందర్ ముదిరాజ్, సిద్ధిక్, కోల శ్రీకాంత్, హెచ్ఏఎల్ బషీరుద్దీన్, యోగ మల్లేష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

