మిడ్జిల్లో చిన్న వ్యాపారుల ఆందోళన
ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని డిమాండ్
జీవనాధారం కోల్పోతామంటూ వ్యాపారుల ఆందోళన
విగ్రహాల ఏర్పాటు పేరుతో ఇబ్బందులంటున్న బాధితులు
7టీవీ ఫోకస్, మిడ్జిల్, జూన్ 21: మహానేతల విగ్రహాల ఏర్పాట్ల కోసం తమ జీవనాధారమైన చిన్న వ్యాపారాలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని మిడ్జిల్ మండలానికి చెందిన వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలను తొలగించే ముందు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి పునరావాసం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహానేతల విగ్రహాల ఏర్పాటు పేరుతో చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మిడ్జిల్ మండలానికి చెందిన పలువురు వ్యాపారులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ ద్వారా నోటీసులు జారీ చేసి, రహదారి పక్కన నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. తరతరాలుగా చిన్న వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాల ఏర్పాటును తాము వ్యతిరేకించడం లేదని, అయితే అందుకు పేదల జీవనాధారాలను దెబ్బతీయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యాపారాలను తొలగించే ముందు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించి పునరావాసం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడితే తమ కుటుంబాల పోషణ భారంగా మారుతుందని తెలిపారు. ఈ అంశంపై మిడ్జిల్ పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించినట్లు వ్యాపారులు వెల్లడించారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

