హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలను పట్టించుకోకుండా పనులు చేపట్టడంపై ఆందోళన. కాప్రా జూలై 23: (7 టీవీ ఫోకస్ ప్రతినిధి)కాప్రా సర్కిల్ పరిధిలోని భావన ఋషి కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన సర్వే నంబర్ 158లోని 2.10 గుంటల స్థలానికి సంబంధించి 2001 నుంచి వివిధ కోర్టుల్లో సాయిబాబా వెల్ఫేర్ అసోసియేషన్, రెవెన్యూ శాఖల మధ్య న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయని సొసైటీ అధ్యక్షుడు సీత ఆంజనేయులు తెలిపారు.2009లో జీహెచ్ఎంసీ లేఅవుట్ ఆమోదం ఇచ్చిన మేరకు ఆ స్థలం సొసైటీ ఆధీనంలో ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే రెండేళ్ల క్రితం అప్పటి తహసీల్దార్ సుచరిత సొసైటీ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని, సొసైటీ నుంచి ఎలాంటి అక్రమ డబ్బులు ఇవ్వకపోవడంతో తమకు వ్యతిరేకంగా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందులో భాగంగా సర్వే నంబర్ 710గా బోర్డు ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్ జారీ చేసిన E2/1774/2025 ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన డబ్ల్యూ.పీ. నెం. 2225/2026లో 2026 జనవరి 27న స్టేటస్ కో ఆదేశాలు పొందామని తెలిపారు. ఆ ఆదేశాల ప్రకారం సర్వే నంబర్లు 158 మరియు 710/1లకు సంబంధించిన స్థలంలో ఎలాంటి పనులు చేపట్టకూడదని చెప్పారు.అయితే తహసీల్దార్ సూచనల మేరకు విద్యుత్ శాఖ అధికారులు నిన్న, ఈరోజు జేసీబీలతో భూమి తవ్వించి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 25 ఏళ్లుగా కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో, అంతేకాక ఇళ్ల మధ్యలో సబ్స్టేషన్ నిర్మించడం ప్రజల భద్రతకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలను గౌరవిస్తూ సబ్స్టేషన్ నిర్మాణానికి ఇచ్చిన కేటాయింపును వెంటనే రద్దు చేసి, చేపడుతున్న పనులను నిలిపివేయాలని భావన ఋషి కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు సీత ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కోర్టు తీర్పు వెలువడే వరకు వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు చేపట్టవద్దని సంబంధిత అధికారులను కోరారు.

