7tv focus : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ప్రత్యేక చొరవతో ఓ దివ్యాంగ యువకుడి జీవితంలో వెలుగులు నింపారు. నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలంటూ సైగల ద్వారా విజ్ఞప్తి చేసిన యువకుడికి కేవలం 24 గంటల్లోనే ఉద్యోగం అందించారు. ముఖ్యమంత్రిని కలిసిన మరుసటి రోజే నియామక పత్రం చేతికి అందడంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.చెన్నైలోని గిండిలో ఉన్న ప్రభుత్వ వృత్తివిద్యా శిక్షణ సంస్థలో బుధవారం ఉదయం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విజయ్ హాజరయ్యారు. అదే సమయంలో దినేశ్ అనే దివ్యాంగ యువకుడు ఆయన వద్దకు వెళ్లి చిన్న కాగితాన్ని అందించాడు. తాను నిరుద్యోగినని, జీవనం సాగించడం కష్టంగా ఉందని, ఏదైనా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని అందులో విజ్ఞప్తి చేశాడు. తన పరిస్థితిని సైగల ద్వారా కూడా ముఖ్యమంత్రికి వివరించాడు.
దినేశ్ చెప్పిన విషయాలను శ్రద్ధగా అర్థం చేసుకున్న విజయ్ అతడికి తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. యువకుడు అందించిన కాగితాన్ని తన కోటు జేబులో పెట్టుకుని అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లారు. సాధారణంగా కార్యక్రమాల్లో ఎంతోమంది తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తుంటారు. అయితే దినేశ్ విజ్ఞప్తిపై విజయ్ వెంటనే స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం జరిగిన ఈ ఘటన తర్వాత గురువారం ఉదయం దినేశ్‌కు ముఖ్యమంత్రిని కలవాలంటూ సచివాలయం నుంచి సమాచారం అందింది. దీంతో అతడు అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ స్వయంగా దినేశ్‌తో కరచాలనం చేసి, ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.

