న్యూఢిల్లీ 7tv focus : జంతర్‌మంతర్ వద్ద జెన్ జెడ్ నిరసనలతో దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో రెబల్ వర్గం పుట్టుకొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (సీజేపీ-డీ) పేరుతో కొత్త వర్గం ఏర్పాటైంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు జంతర్‌మంతర్ వద్ద నిరసన సందర్భంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన మనీష్ బ్రహ్మభట్ ఈ రెబల్ వర్గాన్ని ఏర్పాటు చేశారు. గురువారం ఢిల్లీలో ‘సీజేపీ-డీ’ ఏర్పాటు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (సీజేపీ-డీ)ని మేం ప్రారంభిస్తున్నాం’ అని ఆయన ప్రకటించారు. ప్రజల రక్తం, చెమటతో నిర్మితమైన ఉద్యమం నుంచి ఉద్భవించిన అసలు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ బృందం, తదనంతరం కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన బృందంగా మారిపోవడమే సీజేపీ-డీ ఏర్పాటుకు కారణమని వివరించారు.కాగా, ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై మనీష్ బ్రహ్మభట్ పలు విమర్శలు చేశారు. నిరసనకారులను పక్కనపెట్టి, యువత నేతృత్వంలోని ఈ ఉద్యమాన్ని తమకు నచ్చిన వారితో కూడిన ‘కేజ్రీవాల్ టీమ్’గా సీజేపీని దీప్కే మార్చేశారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు అసలు ఉద్యమాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారని ఆయన మండిపడ్డారు.మరోవైపు సీజేపీ జాతీయ స్థాయి నాయకత్వ బృందం కూర్పును మనీష్ బ్రహ్మభట్ ప్రశ్నించారు. జంతర్ మంతర్ ఆందోళనకు మద్దతు ఇచ్చిన ప్రజలకు, వర్గాలకు ఇందులో ప్రాతినిధ్యం లభించలేదని ఆరోపించారు. ‘రాజకీయ ఒప్పందాలు చేసుకోవడమే వారి లక్ష్యం. విద్యార్థులు లేదా ఇతర రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం పోరాడటంలో వారికి ఎలాంటి ఆసక్తి లేదు. దానికి బదులుగా, కేవలం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు నడుస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు మద్దతు ఇచ్చేందుకే వారు బీజేపీని వ్యతిరేకించాలనుకుంటున్నారు’ అని విమర్శించారు. సీజేపీ కేంద్ర బృందానికి ఎంపికైన ఎనిమిది మందికి ఆప్‌తో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

