7tv focus : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాది లతీఫ్ భట్‌ను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యం ఈనెల 18 తెల్లవారుజామున లతీఫ్ భట్‌ను హతమార్చింది. ఈ సందర్భంగా భారత సైన్యానికి చెందిన ఓ కమాండో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుబురు గడ్డం, ఖాకీ దుస్తులు, ఏకే-203 రైఫిల్, మిలిటరీ పరికరాలతో అతడి లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా భారత సైన్యంలోని ప్రతిష్ఠాత్మక దళమైన 9 పారా స్పెషల్ ఫోర్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.భద్రతా కారణాల దృష్ట్యా ఆపరేషన్లలో పాల్గొనే సైనికుల వివరాలను భారత సైన్యం వెల్లడించరు. అయితే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న బ్యాడ్జి ఆధారంగా ఆ కమాండో 9 పారా స్పెషల్ ఫోర్స్‌కు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దళానికి ‘మౌంటెన్ ర్యాట్స్’, ‘పైరేట్స్’, ‘ఘోస్ట్ ఆపరేటర్స్’ అనే పేర్లూ ఉన్నాయి. కాగా, 9 పారా స్పెషల్ ఫోర్స్ చరిత్ర 1965 భారత్-పాక్ యుద్ధంతో ముడిపడి ఉంది. ఆ సమయంలో శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి మెరుపు దాడులు చేసేందుకు కర్నల్ మేఘ్ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిని తొలుత ‘మేఘ్‌దూత్ ఫోర్స్’గా పిలిచేవారు. హాజీ పీర్ ప్రాంతంలో పాక్ స్థావరాలపై ఈ దళం నిర్వహించిన దాడులు సైనిక నాయకత్వాన్ని ఆకట్టుకున్నాయి. దీంతో 1966 జులై 1న తొమ్మిదో పారాచూట్ కమాండో బెటాలియన్ ఏర్పాటైంది.ఈ దళానికి పర్వత ప్రాంతాల్లో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించడంలో ప్రత్యేక నైపుణ్యం ఉంది. అందుకే దీనికి ‘మౌంటెన్ ర్యాట్స్’ అనే పేరు వచ్చింది. చిన్న బృందాలుగా పనిచేస్తూ, తక్కువ మంది సిబ్బందితో గరిష్ఠ ఫలితాలు సాధించడం వీరి ప్రత్యేకత. ఉధంపూర్ కేంద్రంగా పనిచేసే ఈ కమాండోలు జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌తో కలిసి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలోనూ పాల్గొంటారు. 1971 భారత్-పాక్ యుద్ధంలో ‘ఆపరేషన్ మంధోల్’ ద్వారా పాక్ ఫిరంగులను ధ్వంసం చేసి, ‘డిఫెండర్ ఆఫ్ పూంచ్’గా గుర్తింపు పొందారు. శ్రీలంకలో శాంతి పరిరక్షక కార్యకలాపాలతోపాటు, 1999 కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. 2001లో ఆపరేషన్ అపాచీ, 2016 సర్జికల్ స్ట్రైక్స్లోనూ ఈ దళం పాత్ర ప్రస్తావనకు వచ్చింది.

