7tv focus : మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఓ నగల దుకాణంలో చోరీ జరగడం కలకలం రేపింది. దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తెరిచిన తర్వాతే ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే దుకాణంలో గతంలోనూ చోరీ జరగడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణాన్ని గుర్తుతెలియని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో దుకాణం వెనుక భాగంలోని గది గోడకు రంధ్రం చేశారు. అందులో నుంచి లోపలికి ప్రవేశించి దుకాణంలో ఉన్న వెండి వస్తువులను అపహరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోజూ మాదిరిగానే ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని శేషమాల్ చౌదరి కుమారుడు అజయ్ చౌదరి.. లోపల పరిస్థితిని చూసి అవాక్కయ్యాడు. దుకాణం వెనుక గోడకు రంధ్రం ఉండటం, వెండి వస్తువులు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండోసారి చోరీ!
శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌లో చోరీ జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలోనూ ఇదే దుకాణంలో చోరీ జరగ్గా.. ఇప్పుడు మరోసారి వెనుక గోడకు రంధ్రం చేసి దుండగులు చోరీకి పాల్పడటంతో స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

