7tv focus : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇళ్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాటపట్టారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే ఎక్కడికక్కడ నాయకులను అదుపులోకి తీసుకోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.పేదలకు న్యాయం చేయాలని ప్రశ్నిస్తే అరెస్టులతో సమాధానం చెబుతారా? అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 280 ఇళ్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించి, ఇళ్ల కేటాయింపుల్లో వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమైతే, అక్రమ వసూళ్ల ఆరోపణలపై విచారణ జరిపించడానికి వెనుకాడాల్సిన అవసరం ఏమిటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శిస్తున్నారు.

