ఏలూరు, జూలై 4 (7 టీవీ ఫోకస్): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులను ఆదేశించారు.
ఏలూరులోని జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడం, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేయడం, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే చర్యలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జి.వి.కె. మల్లిఖార్జునరావు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

