షాద్ నగర్, జూలై 4 (7 టీవీ ఫోకస్): విద్యారంగానికి 24 ఏళ్లపాటు అంకితభావంతో సేవలందించిన తెలుగు పండితురాలు పరాంకుశం కరుణశ్రీ సేవలు నేటి ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు కొనియాడారు. పదవీ విరమణ సందర్భంగా ఆమెకు శనివారం ఘన సన్మానం నిర్వహించారు. ఫరూక్నగర్ మండలం మధురాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో తెలుగు పండితురాలిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పరాంకుశం కరుణశ్రీకి శనివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా భావించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కరుణశ్రీ విశేష కృషి చేశారని ప్రశంసించారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, సహచర ఉపాధ్యాయులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆదర్శ ఉపాధ్యాయురాలిగా నిలిచారని కొనియాడారు. ఆమె సేవలు భావితర ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరాంకుశం కరుణశ్రీ, ఆమె భర్త పరవస్తు రమేష్ దంపతులను ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివశంకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రాం రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. సునీత, ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ సులోచన, పీఆర్టీయూ నాయకులు శ్రీధర్ రెడ్డి, పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింలు, జిల్లా కన్వీనర్ మన్నాను, నీలియా నాయక్, ఉపాధ్యాయులు రవీందర్, కె. చంద్రశేఖర్, రెడ్డి నాయక్, సుధారాణి, అరుణ, కుటుంబ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

