7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 4: తెలంగాణ ప్రభుత్వం బోనాల మహోత్సవాల నిర్వహణకు అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన ఆలయ కమిటీలు జూలై 5లోగా దరఖాస్తులు సమర్పించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఆలయ కమిటీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన ఆలయ కమిటీలు 2026 జూలై 5లోగా చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు. దరఖాస్తుతో పాటు కమిటీ లెటర్‌హెడ్‌పై వినతిపత్రం, దేవాలయ కమిటీ రిజిస్ట్రేషన్ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, కమిటీ సభ్యుల ఆధార్ కార్డు ప్రతులు, ఆలయానికి సంబంధించిన మూడు ఫొటోలు జతచేయాలని తెలిపారు. ప్రతి పత్రంపై కమిటీ ముద్రతో పాటు ప్రతినిధుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. బోనాల మహోత్సవాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీలు గడువులోపు దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొందాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విజ్ఞప్తి చేశారు.

