రీ-వెరిఫికేషన్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 19: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ‘నేను సైతం’ సీసీటీవీ కెమెరాల పనితీరు, నిర్వహణ, జియో ట్యాగింగ్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ సమీక్ష నిర్వహించారు. సీపీ కార్యాలయంలోని ప్రధాన కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ స్పెషల్ బ్రాంచ్ సుధీంద్రతో కలిసి అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఎస్ఐలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో మొత్తం 1,37,042 ‘నేను సైతం’ సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో శేరిలింగంపల్లి జోన్లో 42,475, కూకట్పల్లి జోన్లో 53,424, కుత్బుల్లాపూర్ జోన్లో 41,143 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నందున ప్రతి కెమెరా సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని కెమెరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, రీ-వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పనిచేయని కెమెరాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని కెమెరాల జియో ట్యాగింగ్ పూర్తిచేసి, వాటి వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో ప్రజలు, వ్యాపార సంస్థలు, అపార్ట్మెంట్ సంఘాలు, విద్యాసంస్థలు మరింత భాగస్వాములు కావాలని సీపీ పిలుపునిచ్చారు. ఇళ్లు, దుకాణాల వద్ద రహదారి వైపు కనిపించేలా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్‌హెచ్‌వోలు, ఎస్ఐలకు సూచించారు. కెమెరాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణతో పాటు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీపీ స్పెషల్ బ్రాంచ్ సుధీంద్ర, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నర్సింహులు, కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

