7tv focus : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మరింత బలపడింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర వాయవ్య దిశగా కదలుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నవంబర్ 16వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 11.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఇది కేంద్రీకృతమై ఉంది.
విశాఖకు 820 కిలోమీటర్ల దూరంలో..
ప్రస్తుతం తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 940 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీలంకలోని ట్రింకోమలీకి ఈశాన్యంగా 630 కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవుల్లోని శ్రీ విజయపురానికి పశ్చిమాన 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
నేడు తుపానుగా.. రేపు తీవ్ర తుపానుగా!
తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 16వ తేదీ సాయంత్రానికి దక్షిణ, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అనంతరం నవంబర్ 17వ తేదీ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారవచ్చని పేర్కొంది. ఆ తర్వాత మరింత బలపడి వాయవ్య దిశగా పయనిస్తూ నవంబర్ 19వ తేదీ రాత్రికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి అతి తీవ్ర తుపానుగా చేరే అవకాశం ఉందని వెల్లడించింది.

